Monday 15 August 2016

2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ

2050 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ
అనంతపురం: ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్ టాప్‌ జీపులో నిల్చొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు సీఎం మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎందరో మహనీయులను స్మరించుకోవాల్సి ఉందన్నారు.  రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు.

ఎన్టీఆర్ భరోసా పేరుతో పేదవారికి పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.  దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లో పేదవారికి రిజర్వేషన్ల అమలును పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Sunday 14 August 2016

కనుల పండువగా కృష్ణా హారతి


కనుల పండువగా కృష్ణా హారతి 
న్యూస్‌టుడే, శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ (నాగాయలంక): నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా హారతి కార్యక్రమం కనులపండువగా సాగింది. శనివారం కృష్ణానదికి పుష్కర కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు నవ హారతులతో హారతిని సమర్పించగా నాగాయలంక, సమీప మండలాల నుంచి వేలసంఖ్యలో భక్తులు హాజరు కావటంతో శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ భక్తులతో కిక్కిరిసి పోయింది. నాగాయలంక తహశీల్దార్‌ ఎస్‌.నరసింహారావు, శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీరవెంకట మోహన్‌ రావు, దివి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మండవ బాలవర్దిరావు ఆధ్వర్యంలో హారతి కనులపండువగా సాగింది. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు వెంకట్రామ్‌ పుష్కర యాత్రికులతో కలిసి తిలకించగా పుష్కర కమిటీ పెద్దలు చిట్టా సాంబశివరావు, మాదివాడ నిరంజన్‌ రావు, డాక్టర్‌ ఏవీఎల్‌ నారాయణ, ఆలూరి శ్రీనివాసరావు, సర్పంచి శీలి రాము తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి తలశిల స్వర్ణలత, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ సతీమణి శివపార్వతి, ఎంపీడీవో ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు

ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు

ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు


ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వీడన్‌లోని బ్లికింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌)తో దశాబ్దకాలం సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించడం శుభ పరిణామమని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఎల్‌.వేణుగోపాల రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్‌ మందిరంలో నిర్వహించిన దశాబ్ది అనుబంధ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ తాను ఉపకులపతిగా ఉన్న సమయంలో ఈ ఎంఓయూకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యకు దశాబ్ధం క్రితమే ఏయూ నాంది పలికిందన్నారు. త్వరలో విదేశీ విద్యా సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను స్థాపించే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులు స్థానికంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు.
 
ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యమైన ఉన్నవిద్యను అందించే క్రమంలో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తామన్నారు. భవిష్యత్తులో సైతం సంయుక్త పరిశోధనలు, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని సూచించారు. 

బీటీహెచ్‌ స్వీడన్, వైస్‌చాన్సలర్‌ ఏండర్స్‌ హిడిస్టిర్న మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను వద్ధిచేసి, స్వీయ సంపత్తి సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.  ఆవిష్కరణల ప్రాతిపదికగా సమాజం అభివద్ధి చెందుతోందన్నారు. రానున్న దశాబ్ధ కాలంలో మరిన్ని నూతన కోర్సులు, కార్యక్రమాల నిర్వహణ దిశగా నడుస్తామన్నారు. ఇంజినీరింగ్‌ నిపుణులను తీర్చిదిద్ది మానవ వనరుల కొరతను తీర్చనున్నట్లు తెలిపారు.
 
బీటీహెచ ఇండియా ఇనీషియేటివ్స్‌ డైరెక్టర్‌ గురుదత్‌ వేల్పుల మాట్లాడుతూ డబుల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య బి.మోహన వెంకట రామ్‌ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య వేణుగోపాల రెడ్డి, ఆండ్రస్‌లను ఏయూ వీసీ నాగేశ్వరరావు సత్కరించారు.

కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, సి.హెచ్‌ రత్నం, ఇంజనీరింగ్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


నంద్యాలలో విషాదం..


నంద్యాలలో విషాదం..

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ప్రథమనంది ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

రాయల్ కంపౌడ్‌కు చెందిన రాంప్రసాద్(43), సత్యవతి(38) దంపతులు ఆలయ సమీపంలోని పంటపొలాల్లో ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతిచెందగా.. శోభ(14), విజయ్ కృష్ణ(12) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. మార్గ మధ్యలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.




కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదిక తయారు: కడియం

కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదిక తయారు: కడియం
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ ముగిసింది. ఈ కమిటీ మూడు రోజులపాటు 10జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించింది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సబ్‌కమిటీ. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ 10 జిల్లాల్లో సేకరించిన నివేదికను త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్నీ పార్టీల ప్రజాప్రతినిధుల అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. దీని కోసం నిర్వహించే అఖిలపక్ష సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కొందరు లిఖిత పూర్వకంగా కోరారని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతోందని ఆయన పునరుద్ఘాటించారు. పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన చేస్తున్నట్లు కడియం స్పష్టం చేశారు.